మండుతున్న పెట్రోల్ ధరలు

SMTV Desk 2019-05-26 17:13:13  petrol

దేశీయ ఇంధన ధరలు వరసగా మూడో రోజు కూడా పెరిగాయి. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేస్తున్నాయి. మరో వైపు ఇంధన ధరలు కూడా పెరుగుతూ వినియోగదారులను భయపెడుతున్నాయి. శనివారం పెట్రోలు ధర 14నుంచి 15 పైసల దాకా పెరగ్గా డీజిలు ధర లీటరుకు 12నుంచి 13 పైసల మేర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబయితో పాటుగా పలు మెట్రో నగరాల్లో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.46 శాతం పెరిగి 67. 47డాలర్లకు చేరగా, డబ్లుటిఐ క్రూడాయిల్ ధర 1.24 శాతం పెరిగి బ్యారెట్‌కు 58.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 71.53, డీజిలు రూ.66.57కు చేరుకుంది. కాగా హైదరాబాద్‌లో పెట్రోలు రూ.75.86కు, డీజిలు రూ.72.80కి చేరుకుంది. కాగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మే 19నుంచి శనివారం వరకు అంటే ఆరు రోజుల్లో పెట్రోలు లీటరుకు 50 పైసలు, డీజిలు 60 పైసలు పెరిగింది. దీంతో పెట్రో ధరలు మరింతగా పెరుగుతాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.