ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాజయం

SMTV Desk 2019-05-26 17:11:58  India, New Zealand

లండన్: న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా శనివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 39.2 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4/33), నిశమ్ (3/26) అసాధారణ బౌలింగ్‌ను కనబరచడంతో భారత బ్యాటింగ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 37.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ తేలిపోయాడు. కివీస్ బౌలర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. మహ్మద్ షమి, రవీంద్ర జడేజాలు అద్భుతంగా రాణించడం భారత్‌కు కాస్త ఊరటనిస్తుందని చెప్పాలి. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కొలిన్ మున్రో (4)ను బుమ్రా వెనక్కి పంపాడు. అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి మరో ఓపెనర్ గుప్టిల్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. అయితే కుదురుగా ఆడుతున్న గుప్టిల్‌ను హార్దిక్ ఔట్ చేశాడు. గుప్టిల్ మూడు ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో కివీస్ 37 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. కానీ, తర్వాత వచ్చిన సీనియర్ ఆటగాడు రాస్ టైలర్‌తో కలిసి విలియమ్సన్ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు విరాట్ కోహ్లి తరచు బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఇటు విలియమ్సన్, అటు రాస్ కుదురుగా ఆడడంతో కివీస్ కోలుకుంది. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును నడిపించారు. ఇదే క్రమంలో మూడో వికెట్‌కు వందకు పైగా పార్ట్‌నర్‌షిప్‌ను కూడా నెలకొల్పారు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 పరుగులు సాధించాడు. మరోవైపు రాస్ 8 బౌండరీలతో వేగంగా 71 పరుగులు చేశాడు. నికోల్స్ అజేయంగా 15 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ అలవోక విజయాన్ని అందుకుంది.