జగన్‌కు సాదరంగా స్వాగతం పలికిన సిఎం కేసీఆర్‌

SMTV Desk 2019-05-26 16:45:03  kcr, jagan,

వైసీపీ అధినేత కాబోయే ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం సతీసమేతంగా ప్రగతి భవన్‌కు వెళ్ళగా వారికి సిఎం కేసీఆర్‌ సాదరంగా స్వాగతం పలికారు. జగన్‌ను ఆలింగనం చేసుకొని పుష్పగుచ్చాలు ఇచ్చి లోనికి తోడ్కొని పోయి తన కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను పరిచయం చేశారు. ఈనెల 30న విజయవాడలో జరుగబోయే తన ప్రమాణస్వీకారోత్సవానికి రావలసిందిగా జగన్ కేసీఆర్‌ను ఆహ్వానించగా కేసీఆర్‌ అంగీకారం తెలిపారు.

అనంతరం వారివురూ రెండు రాష్ట్రాలకు సంబందించిన అంశాలపై కాసేపు చర్చించుకొన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొంటూ అభివృద్ధిపధంలో ముందుకు సాగాలని నిర్ణయించుకొన్నారని తెలిపింది. కృష్ణా, గోదావరీ నదీజలాలను సమర్ధంగా వినియోగించుకొంటే రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలం చేయవచ్చునని సిఎం కేసీఆర్‌ జగన్‌కు సూచించినట్లు సీఎంవో తెలిపింది. రెండురాష్ట్రాలకు సంబందించిన అంశాలపై కలిసి పోరాడి సాధించుకోవాలని ఉభయులు నిర్ణయించుకొన్నారని తెలిపింది. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే తెలంగాణ ప్రభుత్వ విధానమని సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు సీఎంవో పేర్కొంది. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యి గత ఐదేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించి పరిష్కరించుకోవాలని సిఎం కేసీఆర్‌ జగన్‌కు సూచించినట్లు సమాచారం.

చంద్రబాబునాయుడు పట్ల కేసీఆర్‌కున్న ఏహ్యత, అదేవిధంగా కేసీఆర్‌ పట్ల చంద్రబాబు వైఖరి కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల మద్య దూరం పెరిగి అది అలాగే నిలిచిపోయింది. కేసీఆర్‌, జగన్‌లకు చంద్రబాబునాయుడు ఉమ్మడి శత్రువు కనుక వారిరువురూ దగ్గరయ్యారని చెప్పవచ్చు. తెలంగాణలో కూడా వైసీపీ ఉన్నప్పటికీ దానిని జగన్ ‘స్లీప్ మోడ్’ లో ఉంచేయడం కూడా వారి మద్య రాజకీయశతృత్వం ఏర్పడలేదు. పైగా కేసీఆర్‌ నాయకత్వాన్ని, మార్గదర్శకత్వాన్ని, సాయాన్ని జగన్‌ అంగీకరిస్తున్నారు కనుక వారి స్నేహం వికసిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య ఇటువంటి స్నేహభావం, పరస్పరసహాకారం ఏర్పడితే చూడాలనుకొంటున్నవారందరూ నేడు చాలా సంతోషిస్తున్నారు.