ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధేస్తుంది

SMTV Desk 2019-05-25 22:13:14  Chandrababu,

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వడం అంటే ఏమిటో ప్రస్తుతం ఆ పరిస్థితిని ప్రస్తుతం తెలుగు దేశం ప్రభుత్వం ఆ పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా కుదేలైపోయింది. పార్టీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటమితో పార్టీ శ్రేణులన్నీ ఢీలా పడిపోయాయి. నిన్నమొన్నటి వరకూ సోషల్ మీడియాలో హడావిడి చేసిన వారు సైతం ఇన్ యాక్టివ్ అయిపోయి, సైలెంట్ అయిపోయారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు అయితే ఈ ఓటమి గురించి డీలా పడినట్టు బయటకు కనిపించకుండా మేనేజ్ చేస్తున్నా, ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధిస్తోందని పార్టీ నేతల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారు కొందరు, ఓడిన వారు కొందరు నిన్న చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారట.

ఈ సందర్భంగా మనం నిజంగా అంత ఘోరమైన తప్పిదాలు చేశామా?, ప్రజలను అంతగా కష్టపెట్టామా? అని చంద్రబాబు నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఫలితాలపై లోతుగా విశ్లేషించి ఓటమికి గత కారణాలపై అధ్యయనం చేయాలని నేతలకు సూచించారు. జనసేన వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదని, పవన్ టీడీపీకి స్నేహితుడేనంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ప్రజలు నమ్మడంతో వ్యతిరేక ఓటు మొత్తం వైసీపీకే వెళ్లిపోయిందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలే అన్న సమాధానం చాలామంది నేతల నుంచి వస్తోంది. ఆ కమిటీల పేరుతో అర్హత లేని వారు కొందరు పెత్తనం చెలాయించడంతో పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రభుత్వ పథకాల అమలుకు కూడా కమిషన్లు తీసుకోవడంతో వ్యతిరేకత పెరిగిందని అంచనా వేస్తున్నారు.