చంద్రబాబుకి నా ఉసురు తగిలింది: రోజా

SMTV Desk 2019-05-25 16:18:31  roja,

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలిచి వైసీపీ అధినేత జగన్ సీఎం సీటు ఎక్కబోతున్నారు. గత ఎన్నికల జగన్ సీఎం అవకపోవడానికి నగరి ఎమ్మెల్యే, సినీనటి ఆర్.కె. రోజా‌నే కారణం అని, తాను ఐరన్ లెగ్ అని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు మాట్లాడిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీ విజృంభానికి తెలుగుదేశం నేతలంతా ఢీలాపడిపోయారు.

నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌పై గెలుపొందిన రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘గతంలో నేను వైసీపీలో చేరిన తర్వాత టీడీపీకి చెందిన కొందరు నేతలు నేను ఐరన్ లెగ్ అని కూతలు కూశారు. నేను గెలిస్తే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అని అన్న నేతలంతా నోర్లు మూసుకుని దాక్కున్నారు. నాది ఐరన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్. అసెంబ్లీ సాక్షిగా నన్ను అవమానించిన టీడీపీకి.. ప్రజలు సరైన గుణపాటం చెప్పారు.

నన్ను ఓడించాలని ఎన్నో కుట్రలు చేసిన చంద్రబాబు నాయుడికి నా ఉసురు తగిలింది. నేను ప్రజా సమస్యలపై పోరాడి, ప్రజలు కోసం, అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తిని. కాల్ మనీ సెక్స్ రాకెట్ కోసం అసెంబ్లీలో పోరాడితే అకారణంగా నన్ను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. మహిళాసాధికారికత సమావేశానికి ఆహ్వానించి తనను 24 గంటలపాటు ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో ప్రజలకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నా నాకు చంద్రబాబు నాయుడు నిధులు ఇవ్వకుండా.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసి, నన్ను ఓడించేందుకు చాాలా ప్రయత్నించారు’ అని రోజా విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో తాను చెప్పినట్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అయ్యారని, మళ్లీ రాజన్న రాజ్యం వచ్చేసిందన్నారు. వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఎంతలా ప్రజలు సంతోషంగా ఉన్నారో అంతకంటే ఎక్కువగా ప్రజలు సంతోషంగా ఉంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.