నెట్స్‌లో నేను ఎదుర్కొన్న అత్యుత్తమ ఆటగాడు జోస్ బట్లరే

SMTV Desk 2019-05-25 16:12:01  jos buttler, jofra archer

వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు జోస్ బట్లర్‌తో ప్రత్యర్థి బౌలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ హెచ్చరించాడు. ఈ సందర్భంగా ఆర్చర్ ఓ మీడియాతో మాట్లాడుతూ...‘నెట్స్‌లో నేను ఎదుర్కొన్న అత్యుత్తమ ఆటగాడు జోస్ బట్లరే. అతను 360°లో షాట్స్ ఆడగలడు. ఎంతలా అంటే..? అంపైర్ పక్క నుంచి బంతిని ఎంత చాకచక్యంగా బౌండరీకి తరలించగలడో.. అంతే సులువుగా కీపర్ తలమీదుగా సిక్స్‌ కూడా బాదగలడు. ఒక బౌలర్‌గా అతనికి ఏ ప్రదేశంలో బంతి విసిరినా.. సురక్షితం కాదేమో..? అనిపిస్తోంది’ అని వెల్లడించాడు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో సాధారణంగా ఆఫ్ స్టంప్‌లైన్‌కి వెళ్లి ఆడే జోస్ బట్లర్.. దిల్‌స్కూప్, స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్‌తో బౌండరీలు సాధిస్తుంటాడు. దీంతో.. అతనికి బౌలింగ్ చేసేందుకు బౌలర్లు కాస్త ఇబ్బంది పడుతుంటారు. పాదాల వద్ద యార్కర్ విసిరి.. బౌల్డ్ చేయాలని ఒకవేళ బౌలర్ ప్రయత్నించినా.. అతను తీసుకునే స్టాన్స్ కారణంగా.. బంతి చక్కగా బ్యాట్‌కి కనెక్ట్ అయ్యి.. డీప్ ఫైన్‌లెగ్‌లో బౌండరీ లైన్‌ని దాటిన సందర్భాలూ లేకపోలేదు.