బోల్సనారో ప్రభుత్వ చర్యలపై పార్లమెంట్‌ సభ్యుల అసహనం

SMTV Desk 2019-05-25 16:07:37  Brazil Prime Ministers of the Bolsonaro Government

బ్రసీలియా: బోల్సనారో ప్రభుత్వ కార్యకలాపాలపై పార్లమెంట్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్‌లో సహజ వనరులను ప్రైటేవ్‌ రంగానికి ధారాదత్తం చేస్తున్నందుకు పార్లమెంట్‌ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అలాగే దేశీయంగా వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధీనంలో వున్న భూములను ప్రైవేటుపరం చేయాలన్న అధ్యక్షుడి ఆదేశాలపై వారు నిరసన తెలియచేశారు. అంతేకాక ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ ఆదిమ తెగల వ్యవహారాల శాఖకు సంబంధించి బోల్సనారో తీసుకున్న నిర్ణయాలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ సంస్థ పాత పరిస్థితిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా వారు బుధవారం ఓటు వేశారు. దీనిపై సెనేట్‌లో కూడా ఓటింగ్‌ జరగాల్సి వుంది. బ్రెజిల్‌లోని దాదాపు 8 లక్షల మంది మూలవాసులను సమాజంలోకి తీసుకు వచ్చి వారికి వాణిజ్య సరళి వ్యవసాయం, మైనింగ్‌ కోసం అమెజాన్‌ అటవీ భూములను రిజర్వ్‌ చేయాలన్న అధ్యక్షుడి ఆదేశాలపై పర్యావరణ వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్‌ ఇండిజీనియస్‌ పీపుల్‌ ఏజెన్సీని పునర్వ్యవస్థీకరించి దానిని కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా కుటుంబ, మానవ హక్కుల మంత్రిత్వశాఖ పరిధిలోకి తీసుకు వస్తూ బోల్సనారో ఇటీవల డిక్రీ జారీ చేశారు. మూలవాసులను క్రైస్తవ మతంలోకి మర్చాలని ప్రయత్నిస్తున్న ఇవాంజెలికల్‌ పాస్టర్‌ ఈ మంత్రిత్వశాఖకు నేతృత్వం వహిస్తున్నారు. మూలవాసులకు భూములను అందించి వారిని వ్యవసాయ వాణిజ్యంలో భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం పార్లమెంట్‌ ఆమోదించిన తీర్మానం తమకు లభించిన అత్యున్నత స్థాయి విజయమని బ్రెజిల్‌ ప్రధాన మూలవాసుల సంస్థ ఎఐపిబి అభివర్ణించింది.ప్రభుత్వ చర్యలతో తమ పూర్వీకుల భూములు, మూలవాసుల మాతృభాషలు, సంస్కృతి జీవన మార్గాలు నశించి పోతున్నాయని మూలవాసుల నేతలు నిరసన వ్యక్తం చేశారు. భూమితో తమకున్న అనుబంధం, ప్రకృతి మాతను గౌరవించటం వంటిదని ఎఐపిబి ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా అమెజాన్‌ అటవీ భూముల్లో కొనసాగుతున్న అడవుల నిర్మూలనను అడ్డుకునేందుకు రిజర్వేషన్లు అత్యుత్తమ మార్గమని పర్యావరణ వేత్తలు ప్రభుత్వ చర్యలను సమర్ధిస్తున్నారు.