బిజెపి లోక్‌సభ సీట్లను గెలుచుకోవడమే ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది

SMTV Desk 2019-05-25 15:58:27  Bjp, asasuddin,

జాతీయస్థాయిలో బిజెపి విజయం, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నాలుగు సీట్లు గెలుచుకోవడంపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “జాతీయవాదం లేదా హిందూవాదం బిజెపి బలమని నేను భావిస్తున్నాను. పుల్వమా ఉగ్రదాడి, తదనంతర పరిణామాలను బిజెపి చాలా తెలివిగా తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రజలలో జాతీయవాదం సెంటిమెంటును రగిల్చి విజయం సాధించగలిగింది. బిజెపి జాతీయస్థాయిలో విజయం సాధించడం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ సీట్లను గెలుచుకోవడమే ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే రాష్ట్రంలో బిజెపికి అసలు బలమైన పునాదే లేదు. కానీ చాలా చాకచక్యంగా ఎన్నికల వ్యూహాలు అమలుచేసి గెలిచింది,” అని అన్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “అది చాలా మంచి ఆలోచన. నిజానికి నేటికీ అది ఆచరణ యోగ్యమేనని నేను భావిస్తున్నాను. దేశంలో వివిద రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు... వాటి ప్రభుత్వాలు మనుగడ సాగించాలంటే అందరూ ఫెడరల్‌ ఫ్రంట్‌ గొడుగు క్రిందకు రావడం మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. అన్ని రాష్ట్రాలలోకి మా పార్టీని విస్తరించి బలోపేతం చేసుకొనేందుకు త్వరలోనే నేను రాష్ట్రాల పర్యటన చేస్తాను. సిఎం కేసీఆర్‌ కూడా వస్తే సంతోషిస్తాను,” అని అన్నారు.