వార్మప్ మ్యాచ్‌కు టీంఇండియా సిద్దం

SMTV Desk 2019-05-25 15:55:47  icc world cup 2019, team india vs newzeland

లండన్: వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీంఇండియా న్యూజిలాండ్‌తో శనివారం వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా పరిగణిస్తున్న టీమిండియా ఈ మ్యాచ్ ద్వారా తన లోపాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఇదే లక్షంతో ఉంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో ఇటు భారత్, అటు న్యూజిలాండ్ క్రికెటర్లు ముమ్మర క్రికెట్‌ను ఆడారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించిందనే చెప్పాలి. ఐపిఎల్ ముగిసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. కివీస్‌తో జరిగే మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్ల ఫామ్‌ను పరీక్షించేందుకు ఈ మ్యాచ్ దోహదం పడుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముఖ్యంగా ఐపిఎల్ సందర్భంగా గాయపడిన కేదర్ జాదవ్‌ను ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది.