ఎన్‌బిఎఫ్‌సికి ఆర్‌బిఐ మార్గదర్శకాలు

SMTV Desk 2019-05-25 15:45:39  rbi, reserve bank of india, non banking financial company, nbfc

న్యూఢిల్లీ: ఎన్‌బిఎఫ్‌సి (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ)లకు ద్రవ్య కొరత సమస్యలు రాకుండా ఉండేందుకు గాను ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మార్గదర్శకాలను ప్రతిపాదించింది. అంతేకాక ద్రవ్య లభ్యత సమస్యలను పరిష్కరించేందుకు, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం వంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు పలు నిర్ణయాలను తీసుకుంది. అయితే ఈ ప్రతిపాదనల ప్రకారం, అన్ని ఎన్‌బిఎఫ్‌సిలు డిపాజిట్లలో లిక్విడిటీ కవరేజ్ రేషియో(ఎల్‌సిఆర్)ను ప్రవేశపెట్టనుంది. కాగా 2020 ఏప్రిల్ నుంచి దీనిని ప్రారంభించాలని నిర్ణయించింది. అన్ని డిపాజిట్లను తీసుకునే ఎన్‌బిఎఫ్‌సిలకు ఎల్‌సిఆర్ ప్రతిపాదించగా, నాన్ డిపాజిట్ ఎన్‌బిఎఫ్‌సిలు ఆస్తులు రూ.5000 కోట్లు, ఆ పైన ఉండాలని ఉంది. ఎన్‌బిఎఫ్‌సిలు కనీస అధిక నాణ్యత లిక్విడ్ ఆస్తులు 100 శాతం ఉండాలి, 30 క్యాలెండర్ డేస్ ప్రకారంగా మొత్తం నికర క్యాష్ అవుట్‌ఫ్లో వంద శాతం ఉండాలని ప్రతిపాదించారు. కాగా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌లో రుణ సంక్షోభం అంతిమంగా దేశీయ ఎన్‌బిఎఫ్‌సి (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) రంగంపై ప్రభావం చూపనుందని, ఇది స్థిరీకరణకు దారితీస్తుందని ఇటీవల అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు సహా ఆర్థిక రంగం పర్యవేక్షణ, నియంత్రణ కోసం ఆర్‌బిఐ ప్రత్యేక కేడర్‌ను సృష్టించాలని నిర్ణయించింది. ఆర్‌బిఐ నిర్ణయం నేపథ్యంలో ఫిచ్ రేటింగ్ ఈ విధంగా పేర్కొంది. 2018లో దేశీయ షాడో బ్యాంకింగ్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధిని సాధించింది. అదే సమయంలో ఈ రంగంలో పెద్ద మొత్తంలో రుణ సంక్షోభం చోటుచేసుకుంది. దీంతో ఆర్‌బిఐ రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తోంది.