కెసిఆర్ తో జగన్ కీలక భేటీ

SMTV Desk 2019-05-25 15:33:17  Jagan, Kcr,

ఈనెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ను, ఆ తరువాత తెలంగాణ సిఎం కేసీఆర్‌ను కలువనున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిగూడెంలో జగన్ క్యాంప్ కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. దానిలో జగన్‌ను తమ నేతగా ఎన్నుకొంటారు. ఆ తరువాత 11.30 గంటలకు జగన్‌ అధ్యక్షతన జరుగబోయే వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. దానిలో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన వల్లభనేని బాలశౌరిని పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అనంతరం జగన్‌ హైదరాబాద్‌ చేరుకొని, సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవుతారు. వైసీపీ శాసనసభాపక్షనేతగా తన ఎంపిక తీర్మానాన్ని ఆయనకు అందజేసి 30వ తేదీన ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతించవలసిందిగా కోరుతారు. సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసి విజయవాడలో జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. సిఎం కేసీఆర్‌ ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.