అప్పటి వరకు సినిమాలతోనే జీవితం

SMTV Desk 2019-05-24 18:01:18  rajinikanth, lok sabha elections,

రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులను సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిరాశ పరిచినా, అసెంబ్లీ ఎన్నికల నాటికి సిద్ధమని చెప్పి తలైవా స్పష్టమైన ప్రకటన చేశారు. 2021 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, అప్పటి వరకు సినిమాలతోనే జీవితం అని స్పష్టం చేశారు.

తమిళనాడు శాసన సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నానని తాజాగా మీడియా ప్రతినిధుల ముందు క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల బరిలో రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం చేస్తారని ఆయన అభిమానులు ఆశించారు.కానీ భిన్నమైన నిర్ణయంతో రజనీకాంత్ వారిని నిరాశ పరిచారు.

పార్టీ పెట్టడం చిన్న విషయం కాదని, అందుకు కొంత సమయం పడుతుందని, కానీ 2021 నాటి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి కొంత స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నయన తారతో కలిసి ఎ.ఆర్‌.మురుగుదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘దర్బార్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా 2020 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంత వరకు తన పార్టీకి పేరు కూడా రజనీకాంత్‌ ప్రకటించ లేదు. ఈ సినిమా విడుదలైన తర్వాతైనా పార్టీ పేరు ప్రకటిస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.