తల్లి కళ్ల ముందే ఆరేళ్ల చిన్నారిపై కుక్కల దాడి

SMTV Desk 2019-05-24 16:02:55  madha pradesh crime, bhopal crime,

అభం శుభం తెలియని చిన్నారిని కుక్కల గుంపు పొట్టన పెట్టుకుంది. తల్లి కళ్ల ముందే ఆ చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఈ దారుణం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. బాధిత కుటుంబం కథనం మేరకు...భోపాల్‌లోని అవాధ్‌పురి ప్రాంతానికి చెందిన సంజు (6) ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నాడు. అతని తల్లి బాలింత కావడంతో ఆ సమయానికి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది.

అదే సమయంలో ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన సంజు తండ్రి కొడుకు కోసం తల్లిని అడిగాడు. దీంతో సంజు కోసం బయటకు వచ్చిన ఆమె అక్కడి దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయింది. ఓ కుక్కల గుంపు సంజుపై దాడిచేస్తూ కనిపించడంతో భయంతో ఆమె పెద్ద కేకలు వేసింది. అయినా ఆ కుక్కల గుంపు చిన్నారిని విడిచిపెట్టలేదు.

సంజూ తల్లి అరుపులతో చుట్టుపక్క వారు వచ్చి కుక్కల గుంపును తరమికొట్టినప్పటికీ అప్పటికే సంజు తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహకోల్పోయిన చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. కుక్కల నియంత్రణలో మున్సిపాలిటీ విఫలం కావడం వల్లే ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.