మహిళా పైలట్ మాట వినని పురుష పైలట్.. విమానం డ్రైనేజీలోకి దింపాడు ?

SMTV Desk 2019-05-24 15:56:33  India Express pilot

తన కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా కో-పైలట్ సూచనలు వినడానికి ఇష్టపడని ఓ సీనియర్ పైలట్ ఆమె హెచ్చరికలను పట్టించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించి విమానాన్ని నేరుగా డ్రైనేజీలోకి దింపాడు. 2017లో చోటుచేసుకున్న ఈ ఘటన వెనుక వాస్తవాలు రెండేళ్ల తర్వాత తాజాగా బయటపడ్డాయి. 102 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కోచికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. భారీ వర్షం వల్ల పైలట్లకు రన్‌వే కనిపించలేదు. దీంతో విమానం రన్‌వే మీద నుంచి రైన్ వాటర్ డ్రైనేజీలోకి జారుకుంది. ఫలితంగా విమాన చక్రాలు డ్రైనేజీలో ఇరుక్కున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన DGCA విమానం కమాండింగ్ బాధ్యతల్లో ఉన్న సీనియర్ పైలట్‌దే తప్పని తేల్చింది. తన కంటే 30 ఏళ్ల వయస్సు తక్కువున్న కో-పైలట్ హెచ్చరికలను పట్టించుకోకుండా విమానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. భారీ వర్షం వల్ల విమానం రన్‌వే మార్క్స్ కనిపించడం లేదని, విమానాన్ని కాస్త నెమ్మదిగా నడపాలని కో-పైలట్ సీనియర్ పైలట్‌ను కోరింది. అయితే, ఆమె మాటలు వినకుండా మొండిగా విమానాన్ని దింపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో డీజీసీఏ పైలట్‌ లైసెన్సును మూడు నెలలపాటు రద్దు చేసింది.