వరుణ్ తేజ్ నుంచి అప్పు తీసుకొని మరి నరసాపురంలో రూ.70 లక్షలు ఖర్చుపెట్టా!!

SMTV Desk 2019-05-24 12:55:47  nagababu, mega brother, varun tej

గత ఐదేళ్లలో పవన్ కల్యాణ్ చాలా మారిపోయాడని మెగాబ్రదర్, నరసాపురం జనసేన లోక్ సభ అభ్యర్థి నాగబాబు తెలిపారు. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని జోస్యం చెప్పారు. తాము బురదలో దిగామనీ, ఇప్పుడు కడగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతిరహిత రాజకీయం పేరుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారని నాగబాబు గుర్తుచేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాబ్రదర్ మాట్లాడారు.

తాము కూడా జీరో బడ్జెట్ రాజకీయాలు చేయాలనుకుంటున్నామని నాగబాబు చెప్పారు. ‘జీరో బడ్జెట్ రాజకీయాలు అంటే ఎన్నికల్లో డబ్బులు పంచకపోవడమే. అంతేతప్ప మన వెంట వచ్చే కార్యకర్తలకు అన్నం, నీళ్లు కూడా ఇవ్వకపోవడం కాదు. మనల్ని నమ్ముకుని మనవెంట వచ్చేవారికి కనీసం అన్నం, నీళ్లు పెట్టాలిగా’ అని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఈసీ నిర్దేశించిన రూ. 70 లక్షల మొత్తాన్ని ఖర్చుపెట్టానని నాగబాబు తెలిపారు. ఖర్చుల కోసం కుమారుడు వరుణ్ తేజ్ నుంచి కొంత నగదును అప్పుగా తీసుకున్నానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను 120 పోలింగ్ బూత్ లు సందర్శించాననీ, అక్కడున్న ప్రజలంతా.. ‘సార్ మీకే ఓటేస్తున్నాం సార్.. మీకే ఓటేస్తున్నాం’ అని చెప్పారని నాగబాబు అన్నారు.