రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన సిఎం కెసిఆర్

SMTV Desk 2019-05-11 15:33:32  Rama lingeswara swamy, kcr,

కేరళ తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు రామేశ్వరంలోని ప్రసిద్ధ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారమే రామేశ్వరం చేరుకున్న కేసీఆర్‌ అక్కడ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధి వద్ద అంజలి ఘటించారు. ఆ తర్వాత అక్కడే బస చేసిన సీఎం ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు.

అలాగే అక్కడ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ధనుష్‌ కోటి, రామసేతు, పంచముఖ హనుమాన్‌లను కూడా దర్శించుకున్నారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దంపతులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ లు కూడా వీరితో ఉన్నారు.

అంతేకాకుండా దీంతో కేసీఆర్ తమిళనాడు, కేరళ పర్యటన ముగిసింది. ఈరోజు రాత్రికి ఆయన హైదరాబాద్‌ చేరుకోనున్నారు. కేసీఆర్ గత వారం రోజులుగా కుటుంబంతో కలిసి రెండు రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత కేసీఆర్ రేపు ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 14వ తేదీతో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుండటంతో... రేపు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది