పుట్టుకతోనే మోదీ వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి కాదు: మాయావతి

SMTV Desk 2019-05-10 16:48:05  samajwadi party, bahujan samajwadi party, mayawati

యూపీలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో బద్ధ శత్రువులైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. కుల ప్రాతిపదికన ఈ కూటమి ఏర్పడిందంటూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ట్విట్టర్ వేదికగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ కూటమి కులప్రాతిపదికన ఏర్పడిందనడం అవివేకమని అన్నారు.

పుట్టుకతోనే మోదీ వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి కాదని, ‘కులం’ పేరిట జరిగే ఏ బాధనూ ఆయన అనుభవించలేదని విమర్శించారు. అలాంటి వ్యక్తి తమ కూటమి గురించి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. ఒకవేళ మోదీ నిజంగా వెనుకబడిన కులానికి చెందిన వారే అయితే, ఆర్ఎస్ఎస్ ఆయన్ని ప్రధాని కానివ్వకపోయేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనవసర వ్యాఖ్యలు చేసే మోదీ, తన సొంత రాష్ట్రం గుజరాత్ లో దళితుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని, అందుకు నిదర్శనం వారు ఉపయోగిస్తున్న భాషేనని అన్నారు. మోదీ రెండోసారి ప్రధాని కావడం సాధ్యమయ్యే పని కాదని మాయావతి జోస్యం చెప్పారు.