ఐపీఎల్-12 : నేడు మరో రసవత్తర మ్యాచ్ .. సీనియర్స్ vs జూనియర్స్

SMTV Desk 2019-05-10 16:38:34  Chennai, Delhi capitals,

ఐపీఎల్-12 లీగ్ లో వైజాగ్ వేదికగా నేడు క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. రెండు జట్లు లీగ్ దశలో 9 విజయాలతో 18 పాయింట్లు సొంతం చేసుకున్నాయి. కానీ రన్ రేట్ ఆధారంగా చెన్నై రెండో స్థానంలో నిలవగా ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. దీంతో చెన్నై క్వాలిఫైయర్-1లో ముంబైతో తలపడింది.

క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైన చెన్నై ఓటమి పాలైంది. షాన్.వాట్సన్, అంబటి రాయుడు, మురళి విజయ్ ఫామ్ లో లేకపోవడం చెన్నై జట్టు అవకాశాలను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. కేదార్. జాదవ్ గాయం నుండి తప్పుకోవడం చెన్నై జట్టుకు గట్టి దెబ్బే. బౌలింగ్ లో కూడా ఇమ్రాన్ తాహిర్ తప్పా మిగిలిన బౌలర్లు నిలకడలేమితో బాధపడుతున్నారు. డుప్లిసిస్, రైనా, ధోని, జడేజా వీరి రాణింపుఫై చెన్నై అవకాశాలు ఆధారపడ్డాయి. క్వాలిఫైయర్-2లో గెలిచి చెన్నై జట్టు ఫైనల్ కు చేరాలని చూస్తోంది.

మరో వైపు ఢిల్లీ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. నిలకడలేమి ఢిల్లీని పెద్దగా ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీ బ్యాటింగ్ భారమంతా పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ పై ఆధారపడింది. వీరు రాణించిన మ్యాచ్ లో ఢిల్లీ విజయాన్ని సాధించింది. మిడిల్ ఆర్డర్ ఫామ్ లో లేకపోవడంతో ఢిల్లీ యాజమాన్యం ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉంది.
23 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రబడా వరల్డ్ కప్ నేపథ్యంలో స్వదేశానికి చేరుకోవడం ఢిల్లీకి గట్టి దెబ్బే. అమిత్ మిశ్రా, రూథర్ ఫోర్డ్, కీమో పాల్ బౌలింగ్ రాణింపుపై ఢిల్లీ విజయ అవకాశాలు ఆధారపడ్డాయి. మంచు ప్రభావం లేకపోవడంతో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేస్తోందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. క్రీడా అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని ఈ మ్యాచ్ ఇవ్వగలదని కూడా భావిస్తున్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం కానుంది.