వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు

SMTV Desk 2019-05-10 13:10:50  gold rate, bullion rate, akshaya trutiya

బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగటంతో ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర గురువారం (మే 9న) రూ. 40 పెరిగింది. దీంతో 10 గ్రాములు బంగారం ధర రూ. 32,890 స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ. 38,220 వద్ద కొనసాగుతోంది.

మే 7న అక్షయ తృతీయ రోజు రూ.50 త‌గ్గిన బంగారం ధ‌ర మే 8న రూ.180 పెరిగిన సంగ‌తి తెలిసిందే. మే 9న‌ పెరిగిన ధ‌ర‌ల‌తో కలిపి రెండు రోజుల్లో ప‌సిడి ధ‌ర రూ.220 పెరిగినట్లైంది. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,284.70 డాల‌ర్ల వ‌ద్ద, ఔన్స్‌ వెండి ధ‌ర 14.90 డాల‌ర్ల వ‌ద్ద కొన‌సాగుతోంది.

చైనా-అమెరికా దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న వాణిజ్య ఉద్రిక్త ప‌రిస్థితులు కూడా బంగారం ధ‌ర పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది. అమెరికా -చైనా దేశాల మ‌ధ్య మే 9, 10 తేదీల్లో వాషింగ్టన్‌లో చ‌ర్చల నేప‌థ్యంలో ప్రపంచ మార్కెట్లన్నీ కూడా అటువైపే చూస్తున్నాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే సుమారు 20,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై ఇపుడున్న పది శాతం సుంకాన్ని 25 శాతానికి పెంచడమే గాక, మరో 35,000 కోట్ల డాలర్ల వస్తువులపై 25 శాతం సుంకం వేస్తానని ట్రంప్‌ హెచ్చరించిన సంగ‌తి తెలిసిందే.

ఢిల్లీలోని బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర రూ.40 పెర‌గ‌డంతో 99.9 స్వచ్ఛత (24 క్యారెట్స్‌) క‌లిగిన 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,890 ఉండ‌గా.. 99.5 స్వచ్ఛత (22 క్యారెట్స్‌) క‌లిగిన 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,720 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఇక సౌర్వభౌమ ప‌సిడి ప‌థ‌కంలో 8 గ్రాముల బంగారం ధ‌ర రూ.26,400 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది.

కిలో వెండి ధ‌ర రూ.38,220 వ‌ద్ద కొన‌సాగుతోంది. వారాంత‌పు డెలీవ‌రి వెండి ధ‌ర రూ.339 పెరిగి 37,445కి చేరింది. ఇక‌ 100 వెండి నాణేల కొనుగోలు ధ‌ర రూ.79,000 వ‌ద్ద‌, అమ్మ‌కం ధ‌ర రూ.80,000 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,858 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 30,388 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,875 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 30,345 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.40,220గా ఉంది.