ప్రజల నుంచి అనుకోని స్పందన ఎదురుకావడంతో స్మృతి ఇరానీ షాక్ అయ్యారు

SMTV Desk 2019-05-10 12:47:38  smriti irani, central cabinet minister, congress, madhya pradesh

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలకు అప్పుడప్పుడూ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దీంతో చాలామంది తెగ ఇబ్బంది పడిపోతారు. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతీ ఇరానీ ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు రుణమాఫీ అందిందా?’ అని ప్రశ్నించారు. దీంతో ప్రజలంతా ‘అందింది’ అని ముక్తకంఠంతో జవాబిచ్చారు.

ప్రజల నుంచి అనుకోని స్పందన ఎదురుకావడంతో స్మృతి విస్తుపోయారు. అనంతరం తేరుకుని తన ప్రసంగాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ‘బీజేపీ చెప్పే అబద్ధాలను ఇప్పుడు ప్రజలే నేరుగా తిప్పికొడుతున్నారు’ అని ట్వీట్ చేసింది.