రాష్ట్ర విభజన, ఆంధ్ర ప్రదేశ్ కి...

SMTV Desk 2017-06-03 13:17:40  vijayawada, navanirmana dhikha, chandrababu, benze circle

విజయవాడ, జూన్ 3 : తెలంగాణా విభజన దినం..ఆంధ్రప్రదేశ్ కు చీకటి దినమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఆ కసిని అభివృద్ధిలో చేసి చూపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. జూన్ 2 నవ నిర్మాణ దీక్ష సందర్భంగా శుక్రవారం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం, బెంజ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రవిభజన రోజున ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం, అవమానం జరిగాయని..విభజన తీరును జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ఒక్కమాట చెప్పలేదని, నాపై కోపం ఉంటే సరే ..ఇంకా పెద్దమనుషులు ఉన్నారు కూర్చోబెట్టి మాట్లాడి సమన్యాయం చేయాల్సి ఉండిందని వివరించారు. కానీ పార్లమెంట్ తలుపులుమూసి, ఎంపీలను లోపల పెట్టి, తెలుగుదేశం ఎంపీలను కొట్టి విభజన బిల్లు ఆమోదించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటలీ స్వాతంత్ర్య దినం జూన్ 2 వ తేది అని..అదే రోజున రాష్ట్ర విభజనను అమల్లోకి తీసుకొచ్చారని వివరించారు. కుట్రదారులంతా అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిన బూనారు.. అమరావతిని అద్భుతంగా నిర్మించి శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అందరి పిల్లలకు విద్య,వైద్యం, వ్యాపారం, ఉద్యోగాలకు కేంద్రంగా మారుస్తామని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామమని హామి ఇచ్చారు. హంద్రీనివా నిర్మించి...మడకశిర, కుప్పం వరకు నీళ్ళిస్తాం..గాలేరు-నగరి తో రాయలసీమ జిల్లాలకూ నీరు తీసుకెళ్తాం అని వివరించారు. ఈ వయసులో ఇంతకష్టమెంటి అని అంటున్నారని ..రాష్ట్రం కోసం, ప్రజల కోసమే నా పట్టుదల..ఎన్టీఆర్ ను ఎలా గుండెల్లో పెట్టుకున్నారో అలాగే నాకూ మీ మనుసుల్లో శాశ్విత స్థానం ఇవ్వాలని..అంతకుమించి ఏం ఆశించను అని ఉద్వేగంగా ప్రసంగించారు. దేశాలు స్వాతంత్ర్య దినోత్సవం, రాష్ట్రాలు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాయి కానీ మన రాష్ట్ర చరిత్రలోనే జూన్ 2 ఒక చీకటి రోజు...ఒకనాడు కట్టుబట్టలతో కర్నూల్ పంపేశారు...ఆ తర్వాత ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలు కలిశా యి. .అంతా హైదరాబాద్ వెళ్లాం...నా విజన్ తోనే ఆనగరాన్ని అభివృద్ది చేశా..మళ్లీ సమన్యాయం చేయకుండా పంపేశారు. తెలంగాణాకు వ్యతిరేఖం కాదు..కానీ మనకు న్యాయం చేయలేదన్నదే తన ఆక్రోశం అని వివరించారు. కష్టాల్లో ఉన్నామని, డబ్బుల్లేవని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు..దేశంలోనే ఏ రాష్ట్రం చేయనంతగా 24 వేల 500 కోట్ల రుణమాఫి చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వ్యవసాయమే మార్గమని వివరించారు. పోలవరం, అమరాతి తనకు రెండు కళ్లలాంటివని చెప్పారు. వీటితో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..కరువు రహిత రాష్ట్రమే ప్రజలకు మా ప్రభుత్వమిచ్చే కానుక అని వివరించారు. విశాఖ, తిరుపతిలను అభివృద్ధి చేస్తాం, రాయలసీమను హర్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కష్టాల్లో ఉన్నాం..ఆసరా కావాలి..కాంగ్రెస్ పాలన పోవాలి..అందుకే ఎన్నికల ముందు బిజెపితో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. హోదాకు బదులు ప్యాకేజి ఇస్తామన్నారు. అన్నీ ఆలోచించి సకాలంలో సహాయం అందడమే ముఖ్యమని ప్యాకేజీకి అంగీకరించానని చెప్పారు. కేంద్రం కొన్ని చేసింది..కొన్ని సాధించాల్సి ఉంది..సాధించేందుకు నిరంతర ప్రయత్నం కొనసాగుతుందని వివరించారు.