మోడీ, కేసీఆర్ మధ్య బెడిసికొట్టిన సంబంధాలు

SMTV Desk 2019-05-09 19:02:00  pm modi, kcr, nizamabad lok sabha seat

ప్రధాని నరేంద్ర మోడీకి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పై ప్రధాని మోడీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధానంగా రెండు కారణాలు చూపిస్తున్నారు.

బీజేపీ మద్దతుదారుల నుంచి రూ.8 కోట్ల స్వాధీనం, వారణాసిలో తెలంగాణ పసుపు రైతుల నామినేషన్లు కేసీఆర్ పై నరేంద్ర మోడీకి ఆగ్రహం తెప్పించడానికి కారణమని అంటున్నారు. ఆ విషయంపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేసీఆర్ కు ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇండియన్ బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా అధికారులు 8 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఖాతా నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసినట్లు బిజెపి నాయకులు చెబుతున్నారు . వారణాసిలో మోడీపై నామినేషన్లు దాఖలు చేయడానికి 50 మంది పసుపు రైతులు వెళ్లారు. నిజామాబాద్ లోకసభ సీటుకు కూడా 150 మంది రైతులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తల నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారని అమిత్ షా రెండు రోజుల క్రితం కేసీఆర్ కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే, ఆ డబ్బు స్వాధీనంతో తమకు ఏ విధమైన సంబంధం లేదని, ఎన్నికల సమయంలో కోడ్ అమలులో ఉంటుంది కాబట్టి అది ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని కేసీఆర్ ఆయనతో చెప్పినట్లు సమాచారం.