అమెరికాకు ఇరాన్ హెచ్చరికలు

SMTV Desk 2019-05-09 18:49:41  america, iran, iran warned america

మాస్కో: అమెరికాకు ఇరాన్‌ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆంక్షల బారి నుండి తమకు రక్షణగా ప్రపంచ దేశాలు ముందుకు రానట్లైతే, తన అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తానని ఇందుకోసం 60 రోజులు గడువు విధిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. 2015లో ఆరు దేశాలతో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి గత ఏడాది ఏకపక్షంగా తప్పుకున్న అమెరికా ఇరాన్‌పై తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఒప్పందంలో భాగస్వాములుగా వున్న భద్రతా మండలిలోని మిగతా నాలుగు శాశ్వత సభ్య దేశాలు బ్రిటన్‌, చైనా, రష్యా, ఫ్రాన్స్‌తోబాటు, జర్మనీ ఆ ఒప్పందంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రొహానీ డిమాండ్‌ చేశారు. అమెరికా ఆంక్షల నుంచి ఇరాన్‌ చమురు సంస్థలను, బ్యాంకింగ్‌ రంగాన్ని ఆదుకునేందుకు ఒప్పందంపై సంతకం చేసిన ఈ అయిదు దేశాలు 60 రోజుల్లోగా ముందుకురావాలని రౌహాని కోరారు. ఈ మేరకు ఆయన వారికి లేఖలు రాశారు. బుధవారం నాడు ఆయన జాతి నుద్దేశించి టివిలో మాట్లాడారు. రెండు నెలల గడువు ముగియగానే ఇరాన్‌ తన అణుశుద్ధి కార్యక్రమాలను మరింత విస్తరిస్తుందని చెప్పారు.