ఆ కోపంతోనే నాపై హత్యాయత్నం చేశారు : శిల్పా చక్రపాణి

SMTV Desk 2017-08-24 18:34:09  NANDHYALA, ABHIRUCHI MADHU, SHILPA CHAKRAPANI REDDY, MURDER ATTEMPT

నంద్యాల, ఆగస్ట్ 24 : నంద్యాలలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ.. టీడీపీ నేత అభిరుచి మధుకు గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారు? అసలు నడి రోడ్డులో అలా కాల్పులకు తెగబడుతుంటే ఎవరు పట్టించుకోరా? అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ అలా కాల్పులు జరపడం పెద్ద నేరమని ఇలాంటి వారికి గన్ మెన్లను ఇవ్వడం, నిబంధనలకు విరుద్దంగా వారు వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఒకవేళ ఈ కాల్పుల్లో ఎవరైనా చనిపోయి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. అభిరుచి మధు వర్గీయులే తమ కార్యకర్తలపై దాడికి దిగారు. తను ఒక రౌడీ షీటర్ అంటూ ఆరోపించారు. ఈ ఘటనపై శిల్పా చక్రపాణి రెడ్డి కూడా స్పందిస్తూ.. మధుకు ఉన్న నేర చరిత్ర కారణంగా అప్పట్లో జిల్లా ఉపాధ్యక్షుడి స్థానం నుంచి తనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆ కోపంతోనే తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. కావాలనే పోలింగ్ రోజున తనతో గొడవకు దిగారని తమపై కేసులు పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఎన్ని చర్యలకు పాల్పడిన తాము మాత్రం ఓపికతో ఉన్నామని, నంద్యాల కూడా శాంతియుతంగా ఉండాలన్నదే తమ కోరిక అంటూ చెప్పుకొచ్చారు.