‘చౌకీదార్ చోర్’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ గాంధీ

SMTV Desk 2019-05-09 12:59:22  rahul gandhi, pm modi, supreme court

‘చౌకీదార్ చోర్’ వ్యాఖ్యలపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తాను ఆ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థ అని, దానిపై తనకు అపార గౌరవముందని పేర్కొంటూ రాహుల్ మూడు పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న ఉత్తర్వులిచ్చింది.

ఈ తీర్పు మోదీని ‘చౌకీదార్ చోర్’ అని స్పష్టం చేస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై స్పందించిన సుప్రీం తామెక్కడా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తమకు తప్పుగా ఆపాదించారని స్పష్టం చేస్తూ దీనిపై రాహుల్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాహుల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొంటూ గత నెల 22న అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఆ అఫిడవిట్‌లో విచారం అనే పదాన్ని బ్రాకెట్‌లో ఉంచారని మీనాక్షి తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టు రాహుల్‌కు గత నెల 23న నోటీసులిచ్చింది.

ఆ నోటీసులపై స్పందించిన రాహుల్ పాత అంశాలనే చెబుతూ మరోసారి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో రాహుల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాను క్షమాపణలు చెబుతానని రాహుల్ తెలపడంతో సుప్రీంకోర్టు ఆయనకు మరో అవకాశమిచ్చింది. దీనిలో భాగంగానే నేడు రాహుల్ సుప్రీంకోర్టును క్షమాపణ కోరారు.