ఆగని ఆత్మహత్యలు: మరో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

SMTV Desk 2019-05-08 15:34:10  Suicide,

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉండటం చాలా బాధాకరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల రమేష్, సునీత దంపతుల పెద్ద కుమార్తె సాయిల మానస (17) ఇంటర్ మొదటి సం. పరీక్షలలో ఫెయిల్ అయ్యింది. 10వ తరగతిలో 8 జీపీఏ గ్రేడ్ సాధించిన మానస ఇంటర్మీడియట్‌లో నాలుగు సబ్జెక్టులలో ఫెయిల్ అవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు త్రాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తల్లితండ్రులు ఆమెను తక్షణమే ఖమ్మం ఆసుపత్రికి..అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి 20 రోజుల పాటు చికిత్స చేయించినప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోయారు. సోమవారం ఉదయం ఆమె మృతి చెందింది.

చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చదువులలో ముందుండే తమ కుమార్తె మానసకు ఇంటర్ బోర్డు నిర్వాకం వలన 17 ఏళ్ళకె అర్దాంతరంగా జీవితం ముగిసిపోయిందని తల్లితండ్రులు రోదిస్తున్నారు. ఇంతవరకు కలిసిమెలిసి ఆడుకొని, చదువుకొన్న అక్క ఆత్మహత్య చేసుకోవడం చూసి 9వ తరగతి చదువుతున్న ఆమె చెల్లెలు లిఖిత షాక్ అయ్యింది. కుటుంబ సభ్యులు, బందువులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయం వెంగన్నపాలెం గ్రామంలో మానస అంత్యక్రియలు జరుగనున్నాయి.