ఒడిశాకు తెలంగాణ సహాయం

SMTV Desk 2019-05-08 12:17:33  odisha, kcr, naveen patnyak

ఇటీవల సంభవించిన ఫని తుఫాను కారణంగా ఒడిశా రాష్ట్రం గోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకువస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 15 కోట్లు విరాళంగా ఇచ్చింది .. ఇప్పడు తెలంగాణ రాష్ట్రం ముందుకొచ్చింది .. ఫని తుఫాన్ కారణంగా ఒడిశాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1000 మంది ఉద్యోగులను మంగళవారం ఒడిశాకు పంపింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

భారీగా వీచిన ఫని తుఫాను గాలుల ప్రభావం వల్ల ఒడిశాలో విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి, కరెంట్ వైర్లు తెగిపోయాయి. దీంతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో డీజిల్ జనరేటర్ల ద్వారా అత్యవసర సేవలను అందిస్తున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం తమకు సహకరించాలని నవీన్ పట్నాయక్ సర్కారు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే స్పందించిన సీఎం కేసిఆర్.. చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో మాట్లాడారు. ఒడిశాకు సహాయం చేయాలని ఆదేశించారు.