న్యాయం జరిగేంతవరకు పోరాడుతూనే ఉంటాం

SMTV Desk 2019-05-08 11:40:52  Chandrababu, VV pat,

సుప్రీంకోర్ట్ ఈరోజు 21విపక్ష పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్ పై దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 50శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలని వేసిన వారి పిటిషన్ ను కోర్ట్ చాలా ఈజీగా తోసిపుచ్చింది. తీర్పు తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులతో కలిసి సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. 21 విపక్ష పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. అయినా గానీ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. ఏది ఏమైనప్ప.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలనేదే మా కోరిక. వీవీ ప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం లాభం. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సిందేనని కోరాం. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత ప్రదర్శించాలన్నదే మా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. కొంత సమయం పట్టినా విశ్వసనీయత ముఖ్యమని ఈసీ గుర్తించాలి. అయినా గానీ... మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యంలో అన్ని పద్ధతుల ద్వారా పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే మా పోరాటం కొనసాగిస్తాం. వీవీ ప్యాట్‌ స్లిప్పుల అంశంపై మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్తాం. మా పోరాటం వల్ల ప్రజల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడంలో ఈసీకి నష్టమేంటో అస్సలు అర్థం కావడం లేదు. సిబ్బంది సరిపోరని చెప్పడం తప్పించుకోవడమే అవుతుంది. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి సిబ్బంది సరిపోతారు. మేం న్యాయం జరిగేంతవరకు పోరాడుతూనే ఉంటాం. అంటూ చంద్రబాబు వెల్లడించారు.