నంద్యాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తత

SMTV Desk 2017-08-24 13:19:03  YSRCP, TDP, Nandyala, Police, Gunshot, By-polls

నంద్యాల, ఆగస్ట్ 24: నంద్యాలలో ఉపఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. నంద్యాల ఏడవ వార్డులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తప్ప ప్రశాంతంగా ఎన్నికలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎన్నికలు పూర్తయిన కూడా నంద్యాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ఆందోళనకర వాతావరణం ఇంకా మారలేదు. నంద్యాల నియోజక వర్గం రణరంగాన్ని తలపిస్తుంది. నేడు నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడికి దిగారు. నంద్యాల కౌన్సిలర్ చింపింగ్ బాషా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మరణించడంతో, నేడు అతని అంత్యక్రియలను నిర్వహించారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ తరుణంలో ఇరు పార్టీలకు చెందిన వాహనాలు ఎదురెదురుగా రావడంతో సమస్య ప్రారంభమైంది. శిల్పా వర్గానికి చెందిన కొందరు, టీడీపీ నేత అభిరుచి మధుకు సంబంధించిన వాహనాన్ని పక్కకు తీయాలని అడిగారు. దీనికి ఆయన ససేమిరా అనడంతో... ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ పరిణామంలో టీడీపీ నేత అభిరుచి మధుకు చెందిన వాహనంపై వైసీపీ నేతలు రాళ్లు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో అభిరుచి మధు ప్రైవేట్ గన్ మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, వారిని పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.