బ్రిటీష్ యువరాజు హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ‘ససెక్స్ రాయల్’ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. పుట్టిన బిడ్డ, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున మేఘన్ మార్కెల్ పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరినట్లు బకింగ్ హాం ప్యాలెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉదయం 5.26 గంటలకు ఆమె మగ పిల్లాడికి జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.ససెక్స్‌ల రాయల్ బేబిని చూడడానికి ఈ రాజదంపతులు హితులు, సన్నిహితులతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. కాగా ప్రముఖ హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ను గత ఏడాది మే 19న ప్రిన్స్ హ్యారీ వివాహం చేసుకున్నారు. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్‌లోని సెయింట్ జార్జి చర్చిలో అత్యంత వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది.