పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి

SMTV Desk 2019-05-07 16:07:49  Undavalli, polavaram project,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరంపై అసలు మీ ప్లాన్ ఏమిటో చెప్పకుండా ఉంటే... రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయని చంద్రబాబును టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు . పోలవరం విషయంలో నాణ్యత లోపిస్తే ధన,ప్రాణ నష్టాలు జరుగుతాయన్నారు.మంగళవారం విజయవాడలో ఏర్పాటుచేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్మిస్తున్న స్థలంలో భూమి కుంగిపోవడం సాధారణమైన విషయం కాదని వ్యాఖ్యానించారు. దీని ప్రభావం ప్రస్తుతం కడుతున్న స్పిల్ వేపై ఉంటుందని హెచ్చరించారు. ఓ జియాలజిస్టును కూడా పెట్టుకోకుండా ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారని ఎద్దేవా చేశారు.

జియాలజిస్టులతో ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించాలని కోరారు. ఇప్పటికైనా మేల్కొంటే కేవలం డబ్బు మాత్రమే పోతుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక వరద వస్తే రాజమండ్రి అనేదే ఉండదు, మొత్తం కొట్టుకుపోతుందన్నారు. రాజమండ్రికి, పోలవరం ప్రాజెక్ట్‌కు మధ్య ఉన్న గ్రామాలన్నీ వరద వస్తే కొట్టుకుపోతాయని స్పష్టం చేశారు