IPL: నేటి తొలి క్వాలిఫయర్‌లో ముంబైతో చెన్నై ఢీ

SMTV Desk 2019-05-07 12:22:31  csk vs mi, ipl 2019, csk vs mi first qualifier match

చెన్నై: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంభై ఇండియన్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ముంబై తో జరిగిన రెండు మ్యాచ్ లలో చెన్నై ఓటమి పాలైంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం.. చెన్నైపై రెండు సార్లు గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగబోతోంది. కాగా.. రెండు జట్లూ కీలకమైన ఆటగాళ్లంతా అందుబాటులో ఉండి, అన్నిరంగాల్లోనూ పటిష్టంగా ఉన్నందున మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుంది. ఏ విధంగా చూసినా ఈ రెండు జట్ల మధ్య పెద్ద అంతరం కనిపించదు. రెండు జట్లు కూడా మూడేసి సార్లు ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకున్నవే. సొంత గడ్డపై, తమను విపరీతంగా అభిమానించే అభిమానుల మధ్య ఆడబోతుండడం ధోనీ సేనకు కలిసి వచ్చే అంశం కానుంది. ఈ సీజన్‌లో సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. లీగ్‌దశలో ఇక్కడ ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించిన తిరుగులేని రికార్డు దానికి ఉంది. మరోసారి రేపటి మ్యాచ్‌లో సైతం అదే ఆ జట్టుకు అడ్వాంటేజ్ కానుంది. అయితే రెండు జట్లలో ఏది ఓడినా ఫైనల్‌కు చేరుకునేందుకు ఈ నెల 10న జరిగే రెండో క్వాలిఫైయర్ ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లలో చెన్నై బ్యాటింగ్ టాప్‌ఆర్డర్ అద్భుతంగా రాణించింది. అయితే మంగళవారం మ్యాచ్‌లో బలమైన ముంబయి బౌలింగ్‌పై ఆ జట్టు టాప్ ఆర్డర్ రాణించడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ముంబయి జట్టులో బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా (17 వికెట్లు), లసిత్ మలింగ(15 వికెట్లు), పాండ్య సోదరులు(హార్దిక్ 14 వికెట్లు, కృనాల్ 10 వికెట్లు) లెగ్‌స్పిన్నర్ రాహుల్ చాహల్ (10వికెట్లు) అందరూ చక్కగా రాణించారు. ఇక చెన్నై జట్టులో సారథి ధోనీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 12 మ్యాచ్‌లు ఆడిన ధోనీ మూడు అర్ధసెంచరీలతో 368 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫఫ్ డు ప్లెసిస్, సురేశ్ రైనాలతో పాటుగా అంబటిరాయుడు లాంటి ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించే సత్తా కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే బలమైన షాట్లు కొట్టగల ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ కారణంగా అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు కొంతమేరకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ సీజన్‌లో కేదార్ పెద్దగా రాణించలేదు. ఆ స్థానాన్ని మురళీ విజయ్ కానీ ధ్రువ్ షోరే కానీ భర్తీ చేసే అవకాశముంది. కాగా ఈ సీజన్‌లో చెన్నై బలం అంతా కూడా బౌలింగ్‌లోనే కనిపిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే చిదంబరం స్టేడియం పిచ్‌పై ఆ జట్టులోని స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజలు అద్భుతంగా రాణించారు. 21 వికెట్లతో తాహిర్ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో రెండో స్థానంలో ఉండగా, హర్భజన్, జడేజా ఇద్దరూ చెరి 13 వికెట్లు పడగొట్టారు. బలమైన ముంబయి బ్యాటింగ్ లైనప్‌పై ఈ త్రయం రాణించడంపైనే ఆ జట్టు విజయం ఆధారపడి ఉంది. ముంబయి జట్టులో సారథి రోహిత్ శర్మ(386 పరుగులు), క్వింటన్ డికాక్ 492 పరుగులు) హార్దిక్ పాండ్య(380 పరుగులు) కీరన్ పోలార్డ్‌లు తమదైన రోజున ఆపడం ఎవరి తరమూ కాదని అనేక సందర్భాల్లో నిరూపించారు కూడా. అయితే ప్రిలిమినరీ దశలో ఆడిన ప్రతిమ్యాచ్‌లోను అద్భుతంగా రాణిస్తూ వచ్చిన దీపక్ చాహర్ (16 వికెట్లు) నుంచి మరోసారి అలాంటి ప్రదర్శననే చెన్నై జట్టు ఆశిస్తూ ఉంది. ఈ సీజన్‌లో చెన్నైపై ముంబయి ఇండియన్స్‌దే పై చేయిగా ఉంది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌లలోను ఆ జట్టు విజయం సాధించింది. ఈ లెక్కలన్నీ పక్కన పెడితే వేలాది మంది వీరాభిమానుల మధ్య ఆడుతుండడమే చెన్నై జట్టుకు కొండంత బలంగా ఉండనుండడంతో పోటీ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.