మోదీ హత్యకు మరోసారి కుట్ర

SMTV Desk 2019-05-07 12:07:00  MOdi, tej bahadur

ప్రధానమంత్రి మోదీపై పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌కు సంబంధించిన సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తనకు రూ.50 కోట్లు ఇస్తే ప్రధానిని చంపేస్తానని తేజ్ బహదూర్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తేజ్ బహదూర్ సమాజ్ వాదీ పార్టీ టికెట్‌ మీద వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరయిన రీతిలో దరఖాస్తు లేదన్న కారణంతో అతడి దరఖాస్తును ఈసీ తిరస్కరించింది. ఇది రెండేళ్ల క్రితం నాటి వీడియో కావడంతో దాని విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ వీడియోలో ఉన్నది తానేనని అంగీకరించిన తేజ్ బహదూర్ దానివెనక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ హత్యకు మరోసారి కుట్ర జరగడంఅది కూడా ఆయనపై పోటీకి నామినేషన్‌ వేసిన అభ్యర్థే కుట్ర పన్నడం దిగ్ర్భాంతికి గురిచేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు తెలిపారు. మోదీని ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హింసా మార్గాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు. కాగా, వివక్షపూరితంగానే వారాణసీలో తన నామినేషన్‌ను తిరస్కరించారని తేజ్‌ బహదూర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే.