కోల్‌కతాను చిత్తు చేసిన ముంభై...ప్లేఆఫ్స్ కు హైదరాబాద్

SMTV Desk 2019-05-06 12:03:35  ipl 2019, kkr vs mi, srh

ముంభై: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ముంభై లోని వంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ని 9 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ జట్టు చిత్తుగా ఓడించింది. అయితే కోల్‌కతాను ముంభై ఓడించడంతో హైదరాబాద్‌‌ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. టాస్ గెలిచిన ముంభై ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన కోల్‌కతా ఓపెనర్ క్రిస్‌లిన్ (41: 29 బంతుల్లో 2x4, 4x6) ఆరంభంలోనే వరుస బౌండరీలు బాది కోల్‌కతాకి మెరుపు ఆరంభమిచ్చినా.. మరో ఓపెనర్ శుభమన్ గిల్ (9: 16 బంతుల్లో), దినేశ్ కార్తీక్ (3), ఆండ్రీ రసెల్ (0) ఘోరంగా విఫలమయ్యారు. అయితే.. మిడిల్ ఓవర్లలో నితీశ్ రాణా (26: 13 బంతుల్లో 3x6), రాబిన్ ఉతప్ప (40: 47 బంతుల్లో 1x4, 3x6) కాసేపు బ్యాట్ ఝళిపించినా.. ఫలితం లేకపోయింది. ముఖ్యంగా.. స్లాగ్ ఓవర్లలో ఉతప్ప ఎక్కువ బంతుల్నీ వేస్ట్ చేయడంతో ఆ జట్టు 133/7 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ (55 నాటౌట్: 48 బంతుల్లో 8x4), సూర్యకుమార్ యాదవ్ (46 నాటౌట్: 27 బంతుల్లో 5x4, 2x6), డికాక్ (30: 23 బంతుల్లో 1x4, 3x6) దూకుడుగా ఆడటంతో ముంబయి జట్టు మరో 23 బంతులు మిగిలి ఉండగానే 134/1తో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో పొదుపు బౌలింగ్‌ చేసిన కీలక వికెట్లు పడగొట్టిన హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ ఫలితంతో తాజా సీజన్‌లో ప్లేఆఫ్‌కి చేరిన జట్లుగా ముంబయి ఇండియన్స్ (18 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (18), ఢిల్లీ క్యాపిటల్స్ (18), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12) నిలిచాయి. వాస్తవానికి టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (+0.028), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (-0.251) జట్లు కూడా 12 పాయింట్లు సాధించాయి. కానీ.. వాటితో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్(+0.577)కి నెట్‌ రన్‌రేట్‌ అధికంగా ఉండటంతో ప్లేఆఫ్ ఛాన్స్ దక్కింది.