మళ్ళి ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి .. నేడు కేరళ వెళ్లనున్న కెసిఆర్

SMTV Desk 2019-05-06 12:02:42  CM kcr, Kerala cm,

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కేరళ వెళ్లనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఆయన భేటీ కానున్నారు. త్రివేండ్రంలో రేపు సాయంత్రం 6గంటలకు భేటీ అయ్యే వీరిద్దరు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉంది. నాలుగు విడతల లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ టూర్స్ చేపట్టనున్నారు. తాజా కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కుటుంబంతో కలిసి కేసీఆర్ దర్శించుకోనున్నారు.

ఈ పర్యటన తరువాత ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసీఆర్ పర్యటించవచ్చునని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఓసారి ఢిల్లీ టూర్ కూడా చేపడుతారని సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ రాదని భావిస్తున్న కేసీఆర్.. కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది బెంగాల్ సీఎం మమతా, యూపీ మాజీ సీఎం మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడలతో ఆయన భేటీ అయి చర్చించారు.