ఫణి ఏర్పడిన క్షణం నుండి అది తీరం తాకే వరకు ఏం జరిగిందో మీకు తెలుసా?

SMTV Desk 2019-05-05 18:58:10  fani cyclone, bay of bengal, indian ocean, isro satellite

ఏప్రిల్ 25న బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడిన ఫణి ఆపై తుఫానుగా, చివరికి తీవ్ర పెనుతుఫానుగా తీరం దాటడం వరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కచ్చితంగా అంచనాలు వెలువరించింది. దీని వెనుక ఇస్రో కృషి ఎంతైనా ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని సముద్ర ఉపరితలంపై అలజడి ఏర్పడిన విషయాన్ని తొలుత ఇస్రోకు చెందిన వాతావరణ ఉపగ్రహాలు పసిగట్టాయి.

ఇస్రో నమ్మినబంట్లుగా పేరు తెచ్చుకున్న ఇన్ శాట్3డీ, ఇన్ శాట్3డీఆర్, స్కాట్ శాట్1, ఓషన్ శాట్2, మేఘా ట్రోపిక్స్ ఉపగ్రహాలు దానిపై క్రమం తప్పకుండా ఓ కన్నేసి ఉంచాయి. ఫణికి సంబంధించిన ప్రతి కదలికను రికార్డు చేసి గ్రౌండ్ స్టేషన్ కు పంపించాయి. ఆ హై క్వాలిటీ సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఐఎండీకి పంపారు. ఆ డేటాను విశ్లేషించిన ఐఎండీ శాస్త్రవేత్తలు కచ్చితమైన అంచనాలతో ప్రజలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేయగలిగారు.

ఫణి ఏర్పడిన క్షణం నుంచి అది తీరం తాకే వరకు ఈ ఐదు శాటిలైట్లు ఎక్కడా విశ్రమించలేదు, గురితప్పలేదు. పూరీ వద్ద తీరం దాటుతుందని అంచనా వేయగా, కచ్చితంగా అక్కడే తీరం దాటింది. ఈ శాటిలైట్లు ప్రతి 15 నిమిషాలకు ఓసారి గ్రౌండ్ స్టేషన్ కు ఎంతో విలువైన సమాచారాన్ని పంపాయి.

తుఫాను సమయంలో ఈ డేటానే వాతావరణ సంస్థలకు ప్రాణాధారం అని చెప్పాలి. కచ్చితంగా తుపాను వస్తుందని భావించిన ప్రాంతాలను గుర్తించడం, అక్కడి నుంచి లక్షల మందిని తరలించడం వెనుక ఈ ఐదు శాటిలైట్ల శక్తిసామర్థ్యాలు ఉన్నాయి.