ఇలాంటి పరిస్థితుల్లో మోదీని సాగనంపడం తప్ప మరో మార్గం లేదు: మన్మోహన్ సింగ్

SMTV Desk 2019-05-05 18:53:51  pm modi, mon mohan singh, indian youth,

ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ పాలన యావత్తు అత్యంత వేదనాభరితం, వినాశకరం అని వ్యాఖ్యానించారు. భారత యువత, రైతులు, వ్యాపారులు, ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థ మోదీ బాధితులయ్యారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీని ప్రధాని పదవి నుంచి సాగనంపడం తప్ప మరో మార్గం లేదని మన్మోహన్ స్పష్టం చేశారు.

కాగా, దేశంలో మోదీ ప్రభంజనం వీస్తోందన్న వాదనలను మన్మోహన్ కొట్టిపారేశారు. సమీకృత అభివృద్ధిపై నమ్మకం లేని, కేవలం తన రాజకీయ ప్రాపకం కోసం పాకులాడుతున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ అనుకూల పవనాలు ఎక్కడ వీస్తున్నట్టు? అని ప్రశ్నించారు.

ఈ ఐదేళ్ల కాలంలో అవినీతి దుర్గంధం నలుదిశలా వ్యాపించిందని, ఊహించలేనంతగా పాకిపోయిందని అన్నారు. ఈ క్రమంలో నోట్ల రద్దు స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత భారీ కుంభకోణంగా మన్మోహన్ అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.