#AA20కి ముహూర్తం ఫిక్స్

SMTV Desk 2019-05-05 18:15:35  Allu Arjun, Sukumar, bunny, aa20, trivikram srinivas

నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాదాపుగా ఒక ఏడాది పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ జోరు పెంచారు. మొత్తం మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన బన్నీ వాటిలో మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను ప్రారంభించారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగా సుకుమార్ తో చేయాల్సిన సినిమా, వేణు శ్రీరాం చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయనే విషయంపై పెద్దగా ఎవరికీ క్లారిటీ లేదు. అయితే అకస్మాత్తుగా బన్నీ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సుకుమార్ తో చేయబోయే సినిమాను ఈనెల 11న ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారట.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో 19వ చిత్రం. ఇక సుకుమార్‌తో ఈ స్టార్ హీరో తన 20వ చిత్రాన్ని చేయనున్నారు. మహేష్ బాబు కోసం సుకుమార్ ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ తోనే అల్లు అర్జున్ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం.

ఈ సినిమా కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని.. హీరో పాత్ర విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తారు. అల్లు అర్జున్-, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడవ చిత్రమిది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య 2 చిత్రాలు తెరకెక్కాయి. త్వరలోనే సుకుమార్ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.