ఏపీలో రీపోలింగ్ కు సర్వం సిద్దం...ముగిసిన ప్రచారం

SMTV Desk 2019-05-05 17:11:29  ap assembly elections 2019, re polling

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేపు ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ జరిగే ఐదు కేంద్రాల పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది. ఒక్కో కేంద్రం వద్ద రిటర్నింగ్‌ అధికారి, డీఎస్పీ స్థాయి అధికారి, ప్రత్యేక కేంద్ర పరిశీలకుడి ఆధ్వర్యంలో రీ పోలింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పోలింగ్‌ కేంద్రం లోపల, బయట మొత్తం వీడియో ద్వారా చిత్రీకరిస్తామని వివరించారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరుగుతుందని ఆయన తెలియజేశారు. నరసరావునపేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లి, గుంటూరు పశ్చిమలోని నల్లచెరువు, కోవూరు నియోజకవర్గం పరిధిలో పల్లెపాలెంలోని ఇసుకపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్ప, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో కలనూతలపాడులో రీ- పోలింగ్‌ నిర్వహించనున్నారు. కాగా రీపోలింగ్‌ జరుగుతున్న ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతలలో శనివారం ప్రచారం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అనుమతి లేని ఇరు పార్టీలకు చెందిన రెండు వాహనాలను సీజ్‌ చేసిన అధికారులు, నోటీసులు ఇచ్చారు.