వెనిజులా సంక్షోభంపై పుతిన్‌తో ట్రంప్ సానుకూల చర్చలు

SMTV Desk 2019-05-05 16:34:30  Russia, Russia president Vladimir Putin, america president donlad trump

వాషింగ్టన్: అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం చమురు సంపన్న దేశం వెనిజులా సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సానుకూల చర్చలు జరిపానని వెల్లడించారు. మాస్కో మద్దతు ఇస్తున్న అధ్యక్షుడిని తొలగించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పుతిన్‌తో గంటకు పైగా జరిపిన చర్చల్లో ట్రంప్ శాంతిపూర్వక వైఖరినే అవలంబించడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ....‘మా చర్చలు సానుకూల ధోరణిలో సాగాయి. వెనిజులా సమస్యలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడున్న సంక్షోభం తొలగి శుభపరిణామాలు ఏర్పడాలని కోరుకుంటున్నాను. అక్కడి ప్రజలు ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని మానవతా ధర్మంతో ఆదుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. వెనిజులూ అధ్యక్షుడు నికోలస్ మాడురోను పదవీచ్యుతిని చేయడానికి ప్రతిపక్ష నాయకుడు జువాన్ గుయిడోకు మద్దతుగా సైన్యం చేసిన తిరుగుబాటు విఫలమైన కొన్ని రోజుల అనంతరం ట్రంప్ పుతిన్ చర్చలు జరిగాయి. అమెరికాతో సహా 50కి పైగా దేశాలు గుయిడోను తాత్కాలిక నాయకుడిగా గుర్తించాయి. ఈ నేపథ్యంలో మాడురోపై వత్తిడిని పెంచేందుకు సైన్యం తన వెంట ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా సైనిక స్థావరాల వద్ద ఆందోళనలు చేయాలని గుయిడో తన మద్దతుదారులను కోరారు. వెనిజులాలో నెల రోజులుగా ప్రతిష్టంభన ఏర్పడడంతో అమెరికా రష్యాల మధ్య ఆందోళనలు పెరిగాయి. వెనిజులా గురించి రష్యా, అమెరికా ల నుంచి వెలువడిన అధికారిక ప్రకటనలు వైరుధ్యంగా ఉన్నాయి. ‘అంతర్గత వ్యవహారాల్లో జోక్యం, బలప్రయోగంతో వెనిజులా నాయకత్వాన్ని మార్చే ప్రయత్నాలు సమస్య శాంతియుత పరిష్కారానికి అవరోధం కలిగిస్తాయి. తమ దేశ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వెనిజులా ప్రజలకు మాత్రమే ఉంది అని వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారు’ అని రష్యా అధికారిక ప్రకటన వెల్లడించింది. ఇకపోతే… అమెరికా వెనిజులాపై కఠిన ఆంక్షలు విధించింది. ‘చర్చల ద్వారానే వెనిజులా సమస్యకు పరిష్కా రం కనుగొనాలి’ అని అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శి పాట్రిక్ షనాహన్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారు జాన్‌బోల్డటన్, యుఎస్ సదరన్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ క్రెయిగ్ ఫాలర్‌ల సంయుక్త ప్రకటన తెలిపింది.