విశ్వవ్యాప్తం కానున్న చైనా సైనిక బలగం

SMTV Desk 2019-05-05 16:25:08  china, china army, pakistan, pakistan army

బీజింగ్: చైనా తమ సైనిక బలగాన్ని విశ్వవ్యాప్తం చేసుకునేందుకు అంతర్గత వ్యూహాత్మకంగా సన్నాహాలు చేస్తుంది. అంతేకాక యుద్ధ పటిమను పెంచుకునే దిశలో పాకిస్థాన్‌లో సైనిక స్థావరాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేసుకోవాలని చైనా సంకల్పించిందని భారతీయ నిఘా వర్గాలకు సమాచారం అందింది. అత్యంత విలువైన ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ (ఐబిఎఆర్)ను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని, ఇది ఆత్మరక్షణకే అని, ఇతరులపై దాడికి కాదని చైనా వాదిస్తోంది. ప్రత్యేకించి దక్షిణాసియాలో సైనిక శక్తిగా మారేందుకు అత్యంత మిత్రపక్ష దేశం పాకిస్థాన్‌లో చైనా సైన్యం పాగాకు రంగం సిద్ధం అవుతోంది. భారత్‌కు తద్వారా అమెరికాకు చెక్ పెట్టేందుకు చైనా వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌ను కేంద్రంగా మల్చుకోనుంది. చైనా ఒక్కటే కాకుండా తమతో దీర్ఘకాలిక వియ్యంతో సాగుతున్న దేశాలన్నింటిలోనూ చైనా సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అమెరికా భద్రతా విభాగం అయిన పెంటగాన్ తెలిపింది. విస్తరిస్తోన్న చైనా సైనిక బలగం, చైనా సైనిక విస్తరణ కార్యకలాపాల గురించి అమెరికా కాంగ్రెస్‌కు పెంటగాన్ తాజా నివేదికను అందించింది. డ్రాగన్ దేశంగా పేర్కొనే చైనా రెండేళ్ల క్రితమే 5 సైనిక కేంద్రాలను వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసుకుంది. వీటిని థియేటర్ కమాండ్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఒక్కటైన వెస్టర్న్ థియేటర్ కమాండ్ ( డబ్లుటిసి) ఇండియాతో ఘర్షణల నిర్వహణ దశలో కార్యకలాపాలు, పశ్చిమ చైనాలో ఉగ్రవా దం ఆటకట్టు వ్యవహారాలను నియంత్రిస్తుంది. వాస్తవాధీన రేఖ వెంబడి 4 వేల కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ విభాగం ఈస్టర్న్ లడక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ నెలకొంది. ఇందులో భాగంగా కాల్బలాలు, సంయుక్త సైనిక దళాలు, మూడు వైమానిక స్థావరాలు, ఒక్క రాకెట్ స్థావరం కీలక వ్యవస్థలు ఉంటాయి.