నేడే నీట్ పరీక్ష...

SMTV Desk 2019-05-05 16:18:34  neet exam,

దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్ష ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్న ఈ పరీక్షలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికిపైగా నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పటివలెనే ఈసారి కూడా కఠిన నిబంధనలు అమలులో ఉన్నట్లు అధికారులు వివరించారు. నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభ సమయానికి 2 గంటల ముందే పరీక్షా కేంద్రం ప్రవేశానికి అనుమతిస్తారు. దీంతో విద్యార్థులు అంతా మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని అధికారులు తెలిపారు.

అదేవిధంగా అధికారులు విద్యార్థులకు కొన్ని ముఖ్య సూచనలు ఇచ్చారు. అదేమంటే... షూస్‌, హైహీల్స్‌ చప్పల్స్‌, వాటర్‌ బాటిల్స్‌, స్టేషనరీ, మొబైల్‌ ఫోన్స్‌, కాలిక్యులేటర్స్, కూలింగ్‌ గ్లాసెస్, పర్సులు, ఆభరణాలు, గాజులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులకూ అనుమతి లేదు. తలలో పువ్వులు కూడా పెట్టుకుంటే అనుమతించరు. అలాగే... తినుబండారాలపైనా నిషేధం ఉంది.. కానీ.. షుగర్ వ్యాధిగ్రస్థులు తినుబండారాలు తెచ్చుకొనేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది.

కాగా హాల్ టికెట్ తప్పని సరిగా ఉండాలని.. హాల్ టికెట్లో పొందుపరిచిన ఫోటో కాపీ ఒకటి తీసుకెళ్లాలని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా అట్టిపెట్టుకోవాలని కూడా అధికారులు సూచించారు.