కశ్మీర్‌లో ఉగ్రవాదులు పంజా... బీజేపీ నేత మృతి

SMTV Desk 2019-05-05 16:03:49  Bjp, gul mohmmad meer

కశ్మీర్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. అనంతనాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్‌ను కాల్చి చంపేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నౌగమ్‌ వేరినాగ్ ప్రాంతంలోని మిర్‌ ఇంటికి శనివారం రాత్రి ముష్కరులు ముట్టడించారు. తన కారు తాళాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత తాళాలు తీసుకొని వెళ్లే సమయంలో మిర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అతని శరీరంలో తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలించారు.

అదేవిధంగా మిర్ హత్యోదంతపై బీజేపీ జమ్మూకశ్మీర్‌ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. కశ్మీర్‌ లోయలో హింసాత్మక ఘటనలకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అలాగే మిర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్‌ కాంగ్రెస్‌ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడు జి.ఎ.మిర్‌ వివరించారు. మృతుని కుటుంబానికి వారి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అంతేకాకుండా మహ్మద్‌ మిర్‌ హత్యను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించి వారి కుటుంబాన్ని సానుభూతిని ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదని స్పష్టం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించి తీరుతామని వెల్లడించారు.