ధూమ్ సినిమాను తలపించిన అంతర్జాతీయ దొంగల ముటా

SMTV Desk 2017-06-03 11:26:00  dhoom, cybarabad, robarey, cybarabad commisioner

హైదరాబాద్, జూన్ 3 : నిత్యజీవితాలు, యదార్థ ఘటనల ఆధారంగా రూపొందించే సినిమాలు జనాన్ని చైతన్యం చేస్తే ....నేర సంబంధిత సినిమాలను చూసి అనుకరించే వారు సైతం పెరిగి పోతుండడం ఆందోళన కలిగించే విషయం. బాలీవుడ్ లో రూపోందిన ధూమ్ సినిమా మాదిరిగానే దోంగతనం చేసి పోలీసులకు చుక్కలు చూపించారు. స్టూవర్టు పూరం, వడ్డెలు, ఇతర ముఠాల మాదిరి సాంప్రదాయ దోంగతనాలను వదిలి ఎత్తులు, జిత్తులతో దోంగతనం చేసి మూడున్నర కిలోల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దేశచరిత్రలోనే ఇలాంటి నేరం నమోదు కావడం ఇదే ప్రథమం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దోపిడికి పాల్పడిన వారిలో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కు చెందిన నగల వ్యాపారి అభిషేక్ అగర్వాల్ తన వద్ద ఉన్న ఆభరణాల్ని నగల దుకాణాల యజమానులకు చూపించి ఆర్డర్లు తీసుకునేందుకు గత ఏప్రిల్ 16న సాయంత్రం మూడు గంటల సమయం లో చందానగర్ వెళ్ళారు. ఆయనను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఎత్తులతో రంగంలోకి దిగారు. వ్యాపారి వద్ద ఉన్న కోటిన్నర విలువైన మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు దోచుకోవడమే లక్ష్యంగా వారు ప్రయత్నాలు ప్రారంభించారు. కారులో బయల్దేరిన అభిషేక్ ను ఆ దొంగల ముఠా అనుసరించింది. చందానగర్ లో నగలను చూపించేందుకు అభిషేక్ నగల దుకాణంలోకి వెళ్ళగా ముఠాలోని ఓకరు ప్రత్యేకంగా తయారు చేసిన మేకును కారు వెనుక ఎడమ టైరులో దిగేశాడు. తిరిగి వచ్చిన డ్రైవర్, యాజమాని అభిషేక్ కారులో బయల్దేరారు. కారు కూకట్ పల్లి నెక్సా షోరూం వద్దకు వచ్చే సరికి టైరులో గాలి లేకపోవడంతో రహదారి పక్కన కారు టైరు మార్చే పనిలో నిమగ్నం అయ్యారు. ఆ సమయంలో నగల సంచిని డ్రైవర్ సీటు కింద ఉంచడం గమనించిన ముఠా పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది.టైరు మార్చుతుండగా ముఠాలోని మహిళ కారులోని నగల సంచిని అత్యంత చాకచక్యంగా అపహరించింది. ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల్ని పోలీసులు పరిశీలించారు. దొంగలను గుర్తించారు. చోరీ అనంతరం దొంగలు టయోటా క్రామ్నీ కారులో పారిపోయినట్లు సీసీ ఫుటేజీల్లో తేలడంతో ఆ కారు ఏప్రిల్‌ 9న తెల్లవారుజామున ఆలంపూర్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా నగరంలోకి వచ్చినట్లు, అలాగే చోరీ జరిగిన తర్వాత 17న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో కర్ణాటకలోని దేవనహళి చెక్‌పోస్ట్‌ మీదుగా వెళ్లినట్లు తేలింది. దీంతో దొంగలు బెంగళూరు పారిపోయి ఉంటారనే కోణంలో దర్యాప్తు సాగింది. అయితే సీసీ పుటేజీల్లో వారి ముఖకవలికలు సక్రమంగా లేకపోవడం దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. టయోటా షోరూం, సర్వీస్‌ స్టేషన్‌ల ఆధారంగా కారు నంబరు చిరునామా గురించి వెతకడంతో ముంబయికి చెందిన పంకజ్‌ సత్యనారాయణ షరాఫ్‌ పేరుపై ఉన్నట్లు తేలింది. ఏడాదిన్నర క్రితం అతడు తబ్రేజ్‌ షేక్‌కు అమ్మినట్లు.. అతడి నుంచి రాజేశ్‌ సోనీ, ఎల్‌కే భాటియా, రోహిత్‌ల చేతులు మారినట్లు గుర్తించారు. తర్వాత బెంగళూరుకు చెందిన ఖలీల్‌ పాషా అలియాస్‌ రషీద్‌ కొని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టగా... గత ఏప్రిల్‌ 6న మైకేల్‌, బాల్కిన్స్‌ కొన్నట్లు తేలింది. అయితే ఇంత మంది యజమానులు మారినా పంకజ్‌ పేరుపైనే కారు ఉండటంతో పోలీసుల దర్యాప్తులో జాప్యం జరిగింది. బెంగళూరులోనే ఉంటున్న బాల్కిన్స్‌, మైకేల్‌లను ఆఫ్రికా దేశస్థులుగా గుర్తించిన పోలీసులు వారిని పట్టుకొని విచారించడంతో మరింత సమాచారం లభించింది. బాల్కిన్స్‌ వద్ద నుంచి కారును బెంగళూరులోనే ఉంటున్న నైజీరియన్లు రిచర్డ్‌, హెన్రీలు అద్దెకు తీసుకున్నట్లు తేలింది. బెంగళూరులోని యూబీ సిటీ ప్రాంతంలో ఉంటున్న వీరిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వీరితోపాటు నేరంతో సంబంధమున్న నైజీరియన్లు పాల్‌, వేల్‌నూ అరెస్ట్‌ చేసి చోరీకి వినియోగించిన కారుతోపాటు చోరీకి గురైన ఆభరణాల్లో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించడంతో పెరూ నేరగాళ్ల విషయం బహిర్గతమైంది. బెంగళూరులోనే నౌషద్‌ అనే మెకానిక్‌ వద్ద కారు టైర్లను పంక్చర్‌ చేసే మేకుల్ని తయారు చేయించినట్లు తేలింది. బెంగళూరులోనే ఉంటున్న నైజీరియన్‌ బెంజిమన్‌ ఈ చోరీలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. పెరూ దేశ రాజధాని లిమాకు చెందిన మిరండా రోమియో డానియెల్‌, పెర్సీ మొయిజెస్‌, సుల్కా రోజా(కారులో నుంచి సంచిని అపహరించింది)తో బెంజిమన్‌కు గతంలోనే పరిచయం ఉన్నట్లు గుర్తించారు. చోరి అనంతరం బంగారాన్ని విమానంలో తీసుకెళ్ళడం అంత సులువు కాదు కాబట్టి ముందస్సుగానే ప్రణాళిక రచించి కోల్ కతా,త్రిపుర, డార్జిలింగ్, సిలిగురి మీదుగా రహదారి మార్గంలో నేపాల్ కు వెళ్లారు. ఏప్రిల్ 24 వరకు ఖట్మాండులోనే ఉండి ఎయిర్ ఇండియా విమానంలో మలేషియా వెళ్లారు. మే2న మరోసారి ఖాట్మాండుకు వచ్చి రెండు రోజుల అనంతరం తిరిగి మలేషియా మీదుగా పెరూకు పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. నేరంలో ప్రధాన నిందితుడైన బెంజిమెన్ నైజిరియాకు వెళ్ళినట్లు తెలిసింది. అదే విధంగా మరో నిందితుడు బాల్కిన్స్ బంగ్లాదేశ్ వద్ద సరిహద్దులు దాటుతు సరిహద్దు దళానికి చిక్కాడు. అక్కడ జైలు లో ఉన్న బాల్కిన్స్ ను విచారించనున్నట్లు వెల్లడించారు. పెరూకు పారిపోయిన నిందితుల కోసమై రెడ్ కార్నర్ నోటిసులు జారిచేస్తామని, ప్రభుత్వం అనుమతిస్తే అక్కడకు ప్రత్యేక బృందాల్ని పంపుతామని వెల్లడించారు.