కార్పొరేటర్ పెత్తనంతో సామాన్యుడి తిప్పలు

SMTV Desk 2017-05-27 19:53:34  Chaitanyapuri,Gaddi annaram,corporator,

హైదరాబాద్, మే 30 : ప్రజాప్రతినిధి అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడం. కాని కొందరు కొంతమంది ప్రజాపతినిధులు ప్రజలను తమ చేతిలో కీలు బొమ్మలుగా భావిస్తున్నారు. అంతే కాకుండా తాము చెప్పింది చేయకపోవడంతో అనేకమైన దుర్మార్గాలకు పాల్పడటం జరుగుతోంది. ఇంటిని నిర్మించడానికి కొంత నగదును ముట్టజెప్పకపోతే, నిర్మాణ పనులను అడ్డుకుంటామనే హెచ్చరికను నిర్లక్ష్యం చేయడంతో రెచ్చిపోయిన సదరు కార్పొరేటర్‌.. తన అనుచరులతో కలిసి వెళ్లి పని చేస్తున్న కూలీలపై ఏకంగా రాళ్ల దాడికి పాల్పడ్డ సంఘటన నగరంలో చర్చనీయాంశమైంది. ఇటీవలే ఈ ప్రాంతానికి చెందిన కొందరు కార్పొరేటర్లు, అధికారపార్టీ నేతలు స్థిరాస్తి వ్యాపారులతో వాటాల కోసం బేరసారాలు పెట్టడం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో తెరాసకే చెందిన కార్పొరేటర్‌ ఏకంగా కమీషన్‌ కోసం దౌర్జన్యకాండకు తెగబడటం ఆశ్చర్యపరుస్తోంది. చైతన్యపురి కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డి అనుచరులు శుక్రవారం రాత్రి సాగించిన ఈ దౌర్జన్యకాండపై విమర్శలు చెలరేగుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం చైతన్యపురి హనుమాన్‌నగర్‌కు చెందిన విక్రాంత్‌ గడ్డిఅన్నారంలో ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్నారు. హనుమాన్‌నగర్‌లో సొంత ఇంటి నిర్మాణం కోసం ఇటీవలే పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న విఠల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ తులసీదాస్‌ తమ అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నిర్మాణ స్థలం వద్దకు వెళ్లారు. తొలుత అక్కడ పనిచేస్తున్న కూలీలపై దుర్భాషలాడుతూ.. ‘మా అనుమతి లేకుండా పనులెలా చేస్తార్రా..?’ అంటూ దూషించారు. వారి ధాటికి భయపడిన కూలీలు విక్రాంత్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న విక్రాంత్‌తోనూ విఠల్‌రెడ్డి అనుచరులు కయ్యానికి దిగారు. జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నానని.. కమీషన్‌ ఇచ్చేది లేదని విఠల్‌రెడ్డికి తెగేసి చెప్పారు. వాదనలు తారస్థాయికి చేరుకోవడంతో విక్రాంత్‌పైనా రాళ్లు రువ్వారు. ఈలోగా పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం బాధితుడు చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశారు. గొడవ జరుగుతుండటంతో ఆపేందుకు మాత్రమే తాను అక్కడికి వెళ్లానని.. అకారణంగా తనపై తప్పుడు ఫిర్యాదు చేశారంటూ విఠల్‌రెడ్డి తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.