చైనాకు మొదటిసారిగా షాక్ ఇచ్చిన భారత్

SMTV Desk 2017-08-22 18:40:37  China, Imports, India, Exports, Tempered glass, Taxes

న్యూఢిల్లీ, ఆగస్ట్ 22: గత రెండు నెలలుగా చైనా, భారత్‌‌ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఇండియా మాత్రం తన పని తాను చేసుకుపోతున్న సంగతి సుపరిచితమే. ఈ తరుణంలో భారత్ మొదటిసారిగా చైనాకు కంగుతినిపించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున చైనా నుండి దిగుమతి అవుతున్న టాంపర్డ్ గ్లాస్‌పై సుంకం విధించింది. చైనా నుంచి దిగుమతి అయ్యే టన్ను టాంపర్డ్ గ్లాస్‌పై 52.85 నుంచి 136.21 అమెరికన్ డాలర్ల పన్ను వేయనున్నట్లు రెవెన్యూ విభాగం తెలిపింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ-డంపింగ్ అండ్ అల్లైడ్ డ్యూటీస్ (డీజీఏడీ) దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం చైనా ఈ గ్లాస్‌లను సాధారణ విలువలతో ఎగుమతి చేస్తుంది. దీంతో దేశీయ పరిశ్రమలకు నష్టం వస్తుందని, వాటికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో సుంకం విధించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగం వివరాల ప్రకారం 90.5 శాతం పారదర్శకత కలిగి, 4.2 ఎంఎం మందం మించకుండా ఉన్న టెక్స్చర్డ్ టఫెన్డ్ (టాంపర్డ్) గ్లాసులపై పన్ను విధిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, చైనా నుంచి భారత్‌కు ఎలక్ట్రానిక్, మొబైల్, టాయ్స్ మొదలగు వస్తువులు దిగుమతి అవుతున్నాయి. అయితే చైనా వస్తువులను నిషేధించాలి లేనిపక్షంలో పన్ను పెంచాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున నినాదాలు వినిపించిన నేపధ్యంలో ఇటు వంటి నిర్ణయం గమనార్హం. దీనిపై చైనా మీడియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.