టోర్నీ నుండి నిష్క్రమించిన ఢిల్లీ కీలక ఆటగాడు

SMTV Desk 2019-05-04 12:17:49  kagiso rabada, delhi capitals

ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ కాసిగో రబాడ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఈసారైనా ఐపిఎల్ టైటిల్ గెలవాలనే కసితో ఉన్న ఢిల్లీకి ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఈ సీజన్ లో ప్రారంభం నుంచి అదరగొడుతున్న డిసి ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరుకుంది. ఢిల్లీ ప్లేఆఫ్స్ కు చేరుకోవడంతో రబాడ కీలక పాత్ర పోషించాడు. ఈ దక్షిణాఫ్రికన్‌ స్పీడ్‌ స్టర్ డిసి తరఫున 12 మ్యాచులాడి ఏకంగా 25 వికెట్లు తీశాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక స్వల్ప గాయం కారణంగా బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రబాడ పెవిలియన్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. మరోవైపు త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని వెన్నునొప్పితో బాధపడుతున్న రబాడ విశ్రాంతి తీసుకోవాలని, అందుకే ఐపిఎల్‌ నుంచి వెంటనే రావాలంటూ అతడికి దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఆదేశించింది. దాంతో రబాడ ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఢిల్లీ జట్టును వీడుతుండటంపై రబాడ మాట్లాడుతూ… కీలక దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును వీడి వెళుతున్నందుకు బాధగా ఉందన్నాడు. మరో నెలరోజుల్లోనే వరల్డ్ కప్ ప్రారంభం కానుందని, అందుకే స్వదేశానికి వేళ్లక తప్పదని రబాడ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున ఆడటం ఎప్పటిక​ మర్చిపోలేని అనుభూతి అని, డిసి జట్టు ఐపిఎల్‌ టైటిల్ గెలవాలని ఆకాంక్షించాడు. ఈసారి తమ జట్టు ట్రోఫీ గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని రబాడ పేర్కొన్నాడు. రబాడ ఢిల్లీని వీడటంపై ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ స్పందించాడు. అతడు లేకపోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపాడు. వచ్చే ప్రపంచకప్ లో రబాడ రాణించాలని డిసి యాజమాన్యం, ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపింది.