మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త

SMTV Desk 2019-05-03 18:55:20  CM KCR, Kumarar swamy, water

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిలో మునిగిపోయారు. ఈ వేసవి తాపాన్ని తట్టుకొనేందుకు సీఎం కె.చంద్రశేఖర్ రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఎట్టకేలకు ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అదేవిధంగా ఈ సంవత్సరం యాసంగి పంట కాలంలో వర్షాభావం ప్రభావంతో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో నీరు విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం కేసీఆర్ కోరారు. కేసీఆర్ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్‌కు తెలిపారు.

కాగా ఇది మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్తేనని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయానికి వచ్చారు. ఈ రోజు సాయంత్రం నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటి సరఫరా జరగనుంది.