స్థానిక ఎన్నికలకు ఏపీ సిద్దం

SMTV Desk 2019-05-03 17:09:48  andhrapradesh assembly elections 2019, andhrapradesh mptc zptc elections 2019

అమరావతి: ఏపీలో మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికలతో గందరగోళం అయిన రాష్ట్ర మళ్ళీ స్థానిక ఎన్నికల పోరుకు సిద్దం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 13,060 గ్రామ పంచాయతీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై శుక్రవారం (మే 3) అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్టు కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు. మొదటి దశలో సర్పంచ్ ఎన్నికలు, రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడో దశలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో సందిగ్ధత నెలకొని ఉంది. గతంలో 60 శాతం రిజర్వేషన్లను అమలు చేయగా.. సుప్రీంకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయరాదని తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీల్లో విలీనానికి సంబంధించిన వివాదాలపై ఆ శాఖే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.