అసలు తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారో తెలుసా?

SMTV Desk 2019-05-03 16:02:17  fani cyclone, odisha, titli, hud hud, cyclone names in india

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను.. తీరం దాటింది. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే... ఈ తుఫానుకి ఫణి అనే పేరు ఎలా వచ్చింది.

దానికి ఆ పేరు ఎవరు పెట్టారు..? అసలు తుఫాన్లకు పేర్లేంటి..? ఈ సందేహాలు మీకు కూడా కలిగాయా..? ఒక్క ఫణి తుఫాను మాత్రమే కాదు... ఇటీవల వచ్చిన పెథాయ్, హుద్ హుద్, తిత్లీ... ఇలా అన్ని తుఫాన్ లకు ఒక్కోపేరు ఉంటుంది. వీటికి పేరు పెట్టడానికి ప్రత్యేకంగా ఓ సంస్థ పని చేస్తుందన్న విషయం మీకు తెలుసా..?

దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్‌లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకు ముందు హిందూ. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు. కానీ... అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చే తుఫాన్ లకు మాత్రం 1953 వ సంవత్సరం నుంచే పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది.

తుఫాన్లకు పేరు పెట్టకపోతే... వాటి గురించి వార్తల్లో రాయాలన్నా, చర్చించాలన్నా ఇబ్బందికర పరిస్థితుల తలెత్తుతాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి కూడా సమస్యలు తలెత్తేవి. అందుకే.. తుఫాన్‌లకు పేర్ల పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి. 2004లో డబ్ల్యూఎంవో ( ప్రపంచ వాతావరణ సంస్థ) ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి.

ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. మొత్తం 8 దేశాలు తలో 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు. ఆ పేర్లలో ఇప్పటి వరకు 56 పేర్లను వాడేశారు. మిగిలిన పేర్లు కూడా అయిపోతే... మళ్లీ ఈ దేశాలన్నీ సమావేశమై మరికొన్ని పేర్లను తయారు చేస్తాయి.